– స్టాక్ బ్రోకరిజం మాదిరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్
– ప్రీలాంచ్ డబ్బులతో భూముల కొనుగోళ్లు
– నిర్మాణాల కోసం కొత్త భాగస్వాములు
– బెడిసికొడుతున్న ప్రణాళికలు
– డబ్బుల కోసం మళ్లీ కస్టమర్స్ కి ఎర?
– సాహితీ, జయ గ్రూప్ దారిలోనే హాల్ మార్క్
– తొలివెలుగు ఎక్స్ క్లూజివ్
క్రైంబ్యూరో, తొలివెలుగు:సొమ్ము ఎలా సంపాదించినా చివరికి రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తున్నారు బడాబాబులు. ఒకటి, రెండు ప్రాజెక్ట్స్ లో వచ్చిన లాభాలతో స్తోమతకు మించి భూములు అధిక ధరలో కొనేస్తున్నారు. అగ్రిమెంట్ స్టేజీలోనే నిర్మాణం అయ్యే ఖర్చుకే ప్రీలాంచ్ పేరుతో అమ్మకాలు జరుపుతున్నారు. మార్కెట్ ధర కంటే సగానికి తక్కువ అంటూ ఆశ పుట్టించి లాగేస్తున్నారు. ఆ డబ్బు అంతా మరో ప్రాజెక్ట్ భూములకే ఖర్చు చేస్తున్నారు. దీంతో అసలు ప్రాజెక్ట్ ముందుకు సాగని పరిస్థితి. ఇలా అధిక ఆశతో ఎక్కువ ఊహించుకుని పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో అసలుకే ఎసరు వస్తుంది. ఈ క్రమంలోనే సాహితీ, జయ గ్రూప్ యజమాన్యం ఊచలు లెక్కపెట్టింది. కస్టమర్స్ రోడ్డుమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అయినా, నిండా మునిగిన తర్వాత చలి ఎంటని బరి తెగించి ఉంటున్నారు. ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చి చట్టాన్ని మేనేజ్ చేసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్ లో మరో పేరు మోసిన కంపెనీతో కస్టమర్స్ కి ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా లేకపోతే.. మీ సొంతింటి కల.. కలగానే ఉండే అవకాశం ఉంది. 2008లో ప్రారంభమైన హాల్ మార్క్ బిల్డర్స్ 2017 వరకు ప్రాజెక్ట్స్ అన్నీ చకచకా పూర్తి చేసింది. ఆ తర్వాత మొదలు పెట్టిన వాటిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 8 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ అని చెప్పుకుంటున్నా 2016 నుంచి ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసుకుంటూ వస్తున్నారు.
ఐటీ అధికారుల దృష్టిలో హాల్ మార్క్
మంత్రి మల్లారెడ్డి సోదరుడికి 30 కోట్లకు రెండంతస్తుల కమర్షియల్ స్పేస్ అమ్మేశారు. ఇటీవల ఐటీ దాడుల్లో ఆ మొత్తం వైట్ అమౌంట్ పై ఆరా తీశారు. అయితే, ఆపదలో ఉన్న కంపెనీకి బ్లాక్ మొత్తం ఎంత ఇచ్చారో ఆ లెక్కలపై ఆరా ఇంకా కొనసాగుతోంది.
పెద్దాయన చనిపోయాక కష్టాలు
హాల్ మార్క్ అంటే అశోక్ వర్ధన్… అశోక్ వర్ధన్ అంటే హాల్ మార్క్ లా నడిచేది. ఆయన గుండెపోటుతో మృతి చెందడంతో కష్టాలు మొదలయ్యాయి. ప్రాజెక్ట్స్ కి వచ్చిన డబ్బులన్నీ భూములు కొనుగోలు చేశారు. నిర్మాణాలు కష్టంగా మారింది. అగ్రిమెంట్ చేసుకున్న వారు ఒత్తిళ్లు తేవడంతో కొంత భాగాన్ని నిర్మాణం చేయకుండానే ఓనర్స్ కి అదే పేరుతో వాటాలు ఇచ్చారు. 2 ఎకరాల భూమిని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నేరుగా నిర్మాణం చేపట్టారు. కొండాపూర్ ప్రాజెక్ట్ ని ఇచ్చేశారు. డబ్బులు అడ్జెస్ట్ మెంట్ లో తక్కువలోనే వదులుకున్నారు. అయితే, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కుమారులకు హాల్ మార్క్ డైరెక్టర్స్ కి కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అశోక్ వర్ధన్ వాటాలో అతని భార్యని డైరెక్టర్ గా చేర్చుకుని మొత్తానికే వదిలించుకోవడానికి 130 కోట్లు ఇచ్చేసినట్లు సమాచారం. దీంతో అర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి.
ప్రీ లాంచ్ ప్లాన్
ప్రీ లాంచ్ లతో అమ్మకం చేసినా మార్కెట్ అంతగా సహకరించడం లేదు. విల్లాలు స్క్వేర్ ఫీట్ 6 వేలు అంటూ మార్కెట్ లో పెట్టారు. హెచ్ఎండీఏ ఫైనల్ అనుమతులు రాలేదు. రెరాకు ఇంకా అప్లయి కూడా చేయలేదు. కానీ, ప్రీ లాంచ్ తో మాత్రం డబ్బులు దండుకుంటున్నారు. అయినా, ఇబ్బందులు రావడంతో కొల్లూరు ప్రాంతంలోని ప్రాజెక్ట్స్ థర్డ్ పార్టీలకు అప్పగించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసి సాహితీ, జయ గ్రూప్ దెబ్బ తిన్నాయి. ఇప్పుడు అలాంటిదే మొదలు పెడితే మొత్తానికే మోసం వస్తుంది. కస్టమర్స్ నుంచి వసూలు చేసిన సొమ్ముకి ఎవరు బాధ్యులో తెలియడం లేదు. ప్రాజెక్ట్స్ ఎప్పుడు పూర్తి అవుతాయో గ్యారెంటీ లేదు. గతంలో రెరా లేని సమయంలో భూముల షేరింగ్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటివి చట్ట విరుద్ధం. ఇలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అటు భూ యజమానుల వద్ద నుంచి ఇటు ప్లాట్స్ కొనుగోలు చేసిన వారితో ఒత్తిళ్లు రావడంతో హాల్ మార్క్ బిల్డర్స్ యజమాన్యం దిక్కులు చూస్తోంది.
ఎలాంటి ఇబ్బందులు లేవట!
స్టాక్ బ్రోకరింగ్ మాదిరి తయారు అయి కస్టమర్స్ నెత్తిన శఠగోపం పెడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి బాధితులను తొలివెలుగు ముందే అప్రమత్తం చేస్తోంది. ఈ క్రమంలోనే హాల్ మార్క్ డైరెక్టర్స్ ని సంప్రదించింది. దీంతో ప్రాజెక్ట్స్ అన్నీ ఫాస్ట్ గా నడుస్తున్నాయని తెలిపింది. ప్రీ లాంచ్ ఆఫర్స్ ఉన్నా తాము అమ్మడం లేదని చెప్పింది. అన్నీ లీగల్ గా ఉన్నాయని డైరెక్టర్ జైపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. కానీ, జరుగుతున్న వ్యవహారానికి వారి సమాధానానికి సరితూగడం లేదు. ప్రాజెక్ట్స్ లెక్కల్లో భారీగా తేడాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటిని పూడ్చుకుని సొంతింటి కల ఉండే ప్రజలు ఇబ్బందులు గురి కాకుండా చేయాల్సిన అవసరం ఉంది.