‘దేశముదురు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నటి హన్సిక మొత్వానీ… తక్కువ సమయంలోనే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెరంగేట్రం చేసి పదిహేనేళ్లు అవుతోంది. ఈ సమయంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మెప్పించింది. అటు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
బబ్లీ బ్యూటీ హన్సిక టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘మహా’. హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై యుఆర్ జమీల్ దర్శకత్వంలో మదియళగన్ నిర్మించారు. ఈ సినిమాను జూలై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
యాక్షన్, సస్పన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘మహ’ హన్సిక 50వ చిత్రం కావడం విశేషం. స్టార్ హీరో శింబు కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. గ్రిప్పింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు. మహా టీజర్, ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా హన్సిక పలు విషయాలు పంచుకుంది.
తాను 50 సినిమాలు పూర్తి చేయడం ఎంతో గొప్ప విషయం అని.. చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించడం అదృష్టమని చెప్పుకొచ్చారు హన్సిక. దాదాపు 20 ఏళ్లుగా నటిస్తున్న తనను ప్రేక్షకులు ఆదరించారన్నారు. అయితే సినీ కెరియర్ లో తాను ఇంకా ముందుకెళ్లాలని.. సినిమాల్లో సెంచరీ కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కాగా, హన్సిక నటించిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.