అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట బుధవారం హాజరయ్యారు. హనుమాన్ చాలీసా కేసులో ఎంపీతో పాటు ఆమె భర్త బెయిల్ ను రద్దు చేయాలని ముంబై పోలీసులు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ సందర్బంగా ఎంపీ దంపతులు కోర్టుకు హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ ప్రకటించారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎంపీ కౌర్ దంపతులను ఈ ఏడాది ఏప్రిల్ 23న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెపై పోలీసులు దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో కౌర్ దంపతులకు ప్రత్యేక న్యాయమూర్తి ఆర్ఎన్. రోకడే షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. జైలు నుంచి బయటకు వెళ్లాక కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని కోర్టు ఆదేశించింది.