నవనీత్ కౌర్ దంపతులకు ఊరట లభించింది. హనుమాన్ చాలీసా వివాదంలో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవిలకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
జైలు నుంచి బయటకు వెళ్లాక సాక్ష్యాధారాలను తారుమారు చేయడం లాంటివి చేయకూడదని కౌర్ దంపతులకు కోర్టు సూచించింది. ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని వారికి షరతులు విధించింది. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బెయిల్ ను రద్దు చేస్తామని వారిని కోర్టు హెచ్చరించింది.
ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యాక మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిపోయిందని నవనీత్ కౌర్ అన్నారు. అందుకే సీఎం ఇంటి ముందు తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ అన్నారు. దీంతో వివాదం మొదలైంది.
ఆమె ఇంటిని శివసేన కార్యకర్తలు ముట్టడించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కౌర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై దేశ ద్రోహం సహా పలు కేసులను పోలీసులు నమోదు చేశారు.