హైదరాబాద్ కాషాయమయం అయింది. వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా నగరంలో శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. అంజనీ పుత్రుని ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబై.. భక్తులకు కనువిందు చేశాయి.
నగరంలోని ఆంజనేయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పెద్ద ఎత్తున యాత్రలు చేపట్టారు. రహదారులన్నీ హనుమాన్ నామస్మరణతో మార్మోగాయి. గౌలిగూడలోని రామమందిరంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత గౌలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు శోభాయాత్ర ప్రారంభం అయింది. వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు, కార్యకర్తలతో యాత్ర ఘనంగా నిర్వహించారు.
బాలానగర్ ఐడీపీఎల్ కాలనీలో హిందూవాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని చాటేలా శోభాయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. జగద్గిరి గుట్ట నుంచి ఐడీపీఎల్ వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర శోభాయాత్ర నిర్వహించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించే గొప్ప కర్తవ్యమే శోభాయాత్ర తెలిపారు ఈటల రాజేందర్.
ఇక హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి తాడ్ బండ్ వరకు 21 కిలోమీటర్ల శోభయాత్ర కొనసాగింది. అంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంపాపేట్, ఐఎస్ సదన్, సైదాబాద్, సరూర్ నగర్ మీదుగా శోభయాత్రకు ప్లాన్ చేశారు. వేలాదిమంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు మార్మోగాయి.
శోభాయాత్రల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 8 వేల మంది పోలీసులు, 550 సీసీటీవీ కెమెరాలు, 4 మౌంటెడ్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. ఇటు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు జంట నగరాల్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. మరోవైపు జిల్లాల్లోనూ శోభాయాత్రలు ఘనంగా జరిగాయి. ప్రముఖ ఆంజనేయుని ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి కనిపించాయి.