సికింద్రాబాద్ తుకారాంగేట్ వద్ద యువ మహిళా క్రికెటర్ భోగి శ్రావణి ఇంటి కూల్చివేత ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. శిధిలావస్థకు చేరిందని కారణం చూపుతూ.. ఇంట్లోని సామగ్రిని బయటపడేసి ఇంటిని కూల్చేశారు జీఎచ్ఎంసీ అధికారులు. దీంతో తండ్రితో కలిసి శ్రావణి రోడ్డున పడింది.
ఈ నేపథ్యంలో క్రీడాకారిణి శ్రావణికి మద్దతుగా ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. టీఆర్ఎస్ నాయకుల ప్రలోభాలకు తలొగ్గి.. గ్రేటర్ అధికారులు శ్రావణి ఇంటిని కూల్చివేశారని విమర్శలు గుప్పించారు.
తాను దళిత క్రీడాకారిణి కావడంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు వీహెచ్. శ్రావణికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రావణికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇతర క్రీడాకారులకు సహాయం చేస్తున్న సీఎం.. దళిత బిడ్డ శ్రావణికి పట్ల ఎందుకు చిన్న చూసు చూస్తున్నారని విమర్శించారు. కూల్చివేసిన చోటే ఇల్లు నిర్మించి శ్రావణికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా క్రీడల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు హనుమంతరావు.