‘ఏక్ దో తీన్’ అంటూ కుర్రకారును కిర్రెక్కించినా.. ‘ధక్ ధక్ కర్నే లగా’ అంటూ ప్రేమికుడిని ఉర్రూతలూగించినా.. ‘చోలి కే పీచే క్యా హై’ అనే పాటతో మాస్ ను మైమరింపించినా.. ‘దీదీ తేరా దేవర్ దీవానా’ అంటూ కవ్వించినా అది ఆమెకే చెల్లింది. పాత తరం నాయికల్లో తనదైన అందం అభినయం, నాట్యంతో ‘మాధురి దీక్షిత్’ కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు, ఎవర్గ్రీన్ బ్యూటీగా మాధురి దీక్షిత్ ఇప్పటికీ తన లుక్స్‌తో అభిమానుల్లో అలజడి రేపుతుంది.
మాధురి దీక్షిత్ 1967 మే 15న బొంబాయిలో జన్మించారు. మూడేళ్ళ ప్రాయంలోనే మాధురి నాట్యం చేయడం ఆరంభించింది. ఆమెలోని ప్రతిభను గమనించిన కన్నవారు ప్రోత్సహించారు. కథక్‌లో శిక్షణ ఇప్పించారు. దాదాపు ఎనిమిదేళ్ళు కథక్ నాట్యం అభ్యసించిన మాధురి దీక్షిత్.. తన నాట్యంతో ఇట్టే జనాన్ని కట్టిపడేసేది. చదువుకొనే రోజుల్లోనే ఆమె ఆటపాటల్లోనూ తనదైన బాణీ పలికించింది. స్కూల్ డే, కాలేజ్ డే ఎక్కడైనా మాధురి నృత్యం ఉండాల్సిందే. మైక్రోబయాలజీలో బీఎస్సీ చేస్తూ ఉండగానే చదువుకు స్వస్తి పలికి, చిత్రసీమవైపు అడుగులు వేసింది.
ఈ క్రమంలోనే 1984లో విడుదలైన ‘అబోద్’ మూవీతో మాధురి దీక్షిత్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 1988లో అనీల్ కపూర్‌తో కలిసి ‘తేజాబ్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత వరుస హిట్‌లు రావడంతో తిరుగులేని హీరోయిన్‌గా మారిపోయింది. మాధురి తన మూడు దశాబ్దాల కెరీర్‌లో రామ్ లఖన్, దిల్, తానెక్‌దార్, బేటా, దేవదాస్, సాజన్, బేటా, హమ్ ఆప్కే హై కౌన్.. మొదలైన ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో తన నటనతో, నాట్యంతో ప్రేక్షకులను అలరించింది.
ఇక 1990 విడుదలైన ‘దిల్’ సినిమా ఆమెను యువకుల ముద్దుగుమ్మగా చేసింది. అమీర్ ఖాన్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ ఆమెను అగ్రస్థానంలో నిలిపింది. అలాగే, సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘దేవ్ దాస్’ చిత్రంలో తను నాట్యంతో పరవశింప చేయగలనని నిరూపించుకుంది. ఈ క్రమంలో మాధురి దీక్షిత్ హీరోయిన్ క్యారెక్టర్స్‌తో పాటు ఐటమ్ సాంగ్స్ తరహా పాటలకు అదిరిపోయే డ్యాన్స్‌లు చేసింది. హిట్టైన సాంగ్స్ లిస్ట్ చూస్తే బాలీవుడ్ టాప్ హండ్రెస్ సాంగ్స్‌లో చాలా ఉంటాయి. బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా పలు అవార్డులు అందుకున్న మాధురి దీక్షిత్‌కి 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ శ్రీ బిరుదుతో సత్కరించింది.