– నడ్డా ఇంటికెళ్లిన టీబీజేపీ నేతలు
– అమిత్ షా తో ప్రత్యేక భేటీ
– 3 గంటల పాటు మార్గనిర్దేశం
– ఎన్నికల సంసిద్థతపై షా ఆరా
– తెలంగాణలో జెండా పాతాలన్న అగ్రనేతలు
– ‘హర్ ఘర్ కమల్’ నినాదంతో ముందుకు!
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల కీలక భేటీ ముగిసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభమై దాదాపు 3 గంటల పాటు సాగింది. ఈ మీటింగ్ కు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, విజయశాంతి, డీకే అరుణ, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, గరికపాటి, వివేక్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీళ్లకు అమిత్ షా, జేపీ నడ్డా కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు పార్టీ సంసిద్ధతపై రాష్ట్ర నేతలతో అమిత్ షా చర్చించారు. ఈ సమావేశంలో మిషన్ 90, ఎన్నికల ప్రణాళికలపై రాష్ట్ర నేతలతో అమిత్ షా ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై జేపీ నడ్డా, అమిత్ షా వారికి సూచించినట్టు సమాచారం.
సమావేశం తరువాత పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పార్టీ సంస్థాగత అంశాలపై మాత్రమే చర్చించామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది చర్చించామన్నారు. ముఖ్యంగా ‘హర్ ఘర్ కమల్ ‘ నినాదంతో పార్టీ ఎన్నికల గుర్తును ప్రతి ఇంటికి చేరువ చేసే దిశగా కార్యక్రమాలు ఉండాలని అధిష్టానం సూచించినట్లు చెప్పారు.
ఈ మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ పై చర్చించారా అన్న ప్రశ్నకు చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు. ఇక నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందిస్తూ..బీజేపీ చాలా పెద్ద పార్టీ అని.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై చర్చించామన్నారు.