మన దేశానికి స్వాతంత్య్ర వచ్చి ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయటానికి సిద్దమవుతోంది.
ఇందులో భాగంగా 20 కోట్ల ఇళ్ళ పైన మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరేయటానికి ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 13వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ జాతీయ పండగను కన్నుల పండుగగా చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలందరినీ కోరారు.
ఈ మేరకు ఆయన నిన్న అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్లు అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ లో రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కోపరేటివ్ సొసైటీలు ఇలా అన్ని యంత్రాంగాలు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విశేష వేడుక పౌరుల్లో మరోసారి దేశభక్తిని జాతీయ భావాన్ని రగిలించాలని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన ఎంతో మంది వీరుల స్ఫూర్తిని హర్ ఘర్ తిరంగా ద్వారా చిన్నారుల్లో యువతలో నింపాలన్నారు.