పాకిస్థాన్‌లోని హిందువులు పడే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో అక్కడి వేధింపులు తాళలేక ఓ హిందూ కుటుంబం భారత్‌కు వచ్చేసింది. వీసా లేకపోయినా.. నేపాల్ మీదుగా రాజస్థాన్‌లోని వారి బంధువుల ఇంటికి చేరుకుంది. అయితే, అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని వారిని అరెస్టు చేస్తారని ఆ కుటుంబం భయాందోళనకు గురవుతోంది. తమకు భారతదేశ పౌరసత్వం ఇవ్వాలని, తిరిగి పాకిస్థాన్ వెళ్లలేమని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.
పాక్ సింధ్ ప్రావిన్స్‌లోని మీర్పూర్ ఖాస్‌కు చెందిన పది మందితో కూడిన ఓ కుటుంబం ఉండేది. అయితే ఆ కుటుంబంలోని హరీష్ అనే వ్యక్తిని పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అతడు విడుదలయ్యాడు. కానీ కొందరు అతడిని కిడ్నాప్ చేసి.. డబ్బులు ఇవ్వాలని ఆ కుటుంబాన్ని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫ్యామిలీలోని మహిళలను రేప్ చేస్తామని బెదిరించారు.అయితే ఆ కుటుంబం వద్ద డబ్బులు లేవని తెలుసుకుని 47 రోజుల తర్వాత అతడ్ని వదిలేశారు.
అంతేకాదు, మీర్పూర్‌లో ఉండే హిందూ దళిత కుటుంబాలపై వేధింపులు పెరిగిపోయాయి. దీంతో ఆ బాధలు తట్టుకోలేక ఆ కుటుంబ సభ్యులు పాకిస్థాన్‌ను వీడాలనుకున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లోని తమ చుట్టాల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు భారత వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దానిని అధికారులు తిరస్కరించారు. దీంతో ఆ కుటుంబం అక్కడ నుంచి నేపాల్‌కు వెళ్లింది. నిజానికి నేపాల్ నుంచి వీసా పొందడం సులభమని వారు భావించారు. కానీ అక్కడ నుంచి వీసా దొరకలేదు.
దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న నేపాల్‌లోని స్థానిక వ్యక్తి సహాయంతో భారత్ సరిహద్దుకు చేరారు. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు నడిచి సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్‌కు, అక్కడి నుంచి 27న జోధ్‌పూర్‌కు మరునాడు బార్మర్‌లోని బంధువుల ఇంటికి చేరుకున్నారు.
అయితే, ఆ కుటుంబం అక్కడ నివసించడం అక్రమమని, ఇది తెలిస్తే వారిని అరెస్ట్ చేస్తారని స్థానికులు చెప్పారు. దీంతో ఏప్రిల్ 23న స్థానిక విదేశీ కార్యాలయానికి వెళ్లారు. పాక్‌లో వేధింపులు తాళలేక అతి కష్టం మీద బార్మర్‌కు చేరుకున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లలేమని, తమకు వెంటనే వీసా, పౌరసత్వం ఇవ్వాలని ఆ కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరింది.
అలాగే 1947లో విభజన సమయంలో తమ బాబాయ్ భారతదేశానికి వచ్చారని, కానీ మా తాత ఇక్కడకు రావడానికి ఇష్టపడకపోవడంతో తాము పాకిస్థాన్‌లోనే ఉండిపోయామని కుటుంబ సభ్యుల్లో ఒకరైన కుమార్ చెప్పారు. అయితే, పాక్ నుంచి వలస వచ్చే వారు దేశంలో ఉండేందుకు నిబంధనలు అనుమతిస్తాయని పోలీస్ అధికారి చెప్పారు. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.