రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ‘దిశ’ ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత కూడా మృగాళ్లలో మార్పులు రావడం లేదు. తాజాగా కోదాడలో ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. యువతికి శీతల పానియంలో లిక్కర్ కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజులు క్రితం రోడ్డుపై యువతి వెళుతుండగా సదరు యువకులు ఆమెను బలవంతంగా ఆటోలో లాక్కెళ్లారు. ఆమెను విచక్షణ రహితంగా కొట్టారు. శీతల పానియంలో లిక్కర్ కలిపి ఆమెతో బలవంతంగా తాగించి ఆమెపై మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ దుర్మార్గుల చెర నుంచి తప్పించుకున్న యువతి ఆ విషయాన్ని బంధువులకు చెప్పి కన్నీళ్లు పెట్టు్కుంది. దీంతో బంధువుల సహాయంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం ఆమెను పోలీసులు ఆస్పత్రికి పంపించారు.
కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే నిందితుల్లో ఒకరు అధికార పార్టీ కౌన్సిలర్ కుమారుడు. దీంతో కుమారుడిని రక్షించేందుకు కౌన్సిలర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. విషయం బయటికి చెబితే తమ కొడుకును లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, తమకు పోలీసులు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.