తల్లిదండ్రులు తమ స్టేటస్ కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకు రావద్దని ప్రధాని మోడీ సూచించారు. కేవలం చదువుల విషయంలో వారిపై ఒత్తిడి పెంచ వద్దని, ఇతర విషయాల్లోనూ వారిని ప్రోత్సహించాలని ఆయన కోరారు. ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా ప్రధాని మోడీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల్లో ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలనే విషయంపై విద్యార్థులకు ప్రధాని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…
పరీక్షా పే చర్చ కార్యక్రమం తనకు కూడా ఓ పెద్ద పరీక్ష అన్నారు. ఈ పరీక్షకు కోట్లాది మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని ఆయన క్రికెట్‌తో పోల్చారు.
విద్యార్థులు తమ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదని ఆయన సూచించారు. జీవితంలో దేనికైనా టైం మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమని తెలిపారు. టైమ్ మేనేజ్ మెంట్ అనేది మన తల్లుల దగ్గర నుంచి నేర్చుకోవాలని ఆయన సూచించారు.
జీవితంలో పరీక్షలు వస్తాయి పోతాయన్నారు. కానీ జీవితాన్ని గడపాలని వెల్లడించారు. పరీక్షల కోసం షార్ట్‌కర్ట్స్ వెతకొద్దన్నారు. కాపీ చేయడం కంటే చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కాపీ చేస్తే ఒక్క పరీక్షలో మాత్రమే నెగ్గొచ్చన్నారు. కానీ జీవితాన్ని నెగ్గలేరన్నారు.