నారాయణ పేట నూతన కలెక్టర్ హరిచందన వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో జోనల్ కమిషనర్ గా పనిచేసిన హరిచందన IAS బదిలీపై ఈ మధ్యనే కొత్తగా ఏర్పడ్డ నారాయణ పేట కలెక్టర్ గా వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన మార్క్ చూపిస్తున్నారు.
నారాయణ పేట్ ఈ మధ్యనే జిల్లాగా ఏర్పడింది, అత్యంత వెనకబడిన ప్రాంతం. ఎలాంటి ఉపాధి ఉండదు, సాగు నీరు కూడా బోర్లపైన ఆధారపడ్డ ప్రాంతం. కర్ణాటకను అనుకోని ఉన్న ఈ జిల్లా అభివృద్ధి కి దూరంగా ఉంది. కొడంగల్ లోని రెండు మండలాలు, నారాయణ పేట్, మక్తల్ నియోజకవర్గాలకు కలుపుకొని ఈ జిల్లా ఏర్పడింది. జిల్లాల్లోని ప్రజలు ఎక్కువ బ్రతుకుదేరువు కోసం బొంబాయి, హైదరాబాద్ వెళ్తుంటారు. జిల్లాలో మగ్గాలపై బట్టలు నేస్తుంటారు. ఇక్కడ నేసిన బట్టకు బొంబాయిలో చాలా డిమాండ్ ఉంది. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ తయారయ్యే బట్ట గురించి అంతగా తెలియదు, మల్బరీ పురుగులనుంచి వచ్చే దారం తో ఈ బట్టను నేస్తారు.
మల్బరీ పురుగులనుంచి తయారు చేసే దీన్ని టస్సర్ బట్టగా పిలుస్తారు. ప్రభుత్వ ప్రోత్సాహం, మార్కెటింగ్ లేక చాలా మంది బట్టలు నేయడం మానేశారు, మంచి ఉపాధి ఉన్నప్పటికీ దీనిపై ఇప్పటివరకు ఏ అధికారి దృష్టి పెట్టలేదు. కొత్తగా వచ్చిన కలెక్టర్ హరిచందన మాత్రం మొదటి ప్రాధాన్యతగా నేతన్నల సమస్యలు తీసుకున్నారు. నారాయణ పేట జిల్లాలో ఇలాంటి బట్ట ఒకటి తయారవుతుంది అనేది తెలంగాణ ప్రాంతం మొత్తం తెలిసేలా చేయడానికి, టస్సర్ బట్టకు మార్కెటింగ్ కల్పించడానికి నడుంబిగించారు.
గ్రామాల్లోకి వెళ్లి నేతన్నలకు ఉన్న సమస్యలు, వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు కలిపిస్తే ఉత్పత్తి పెంచగలరో తెలుసుకుంటున్నారు. జిల్లలో తయారయ్యే బట్ట గురించి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా చేస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. కలెక్టరమ్మ స్వయంగా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుండడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ పేట్ జిల్లా ప్రజలు అమాయకులని, చాలా వెనకబడ్డ ప్రాంతం అని , ఉపాధి, అభివృద్ధి పైనే తాను దృష్టి పెడుతున్నట్లు చెప్పారు కలెక్టర్ హరిచందన.