– కేవలం రూ.11 కోట్లే విలువ కట్టిన హరిప్రియ
– బీజేపీకి లింకులంటూ ఆరోపణలు
– రూ.67 కోట్లకు దక్కించుకున్న ముంబై కంపెనీ
– ల్యాండ్ పైనే అందరి దృష్టి
– బాలానగర్ లో భూమి విలువ రూ.50 వేల కోట్లు
– అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే!
– కానీ, ఎన్‌ఎల్‌ఎంసీ పేరుతో కొట్టేసే ప్లాన్
– దేశవ్యాప్తంగా ఐడీపీఎల్ క్లోజింగులపై..
– తొలివెలుగు క్రైంబ్యూరో ప్రత్యేక కథనం
క్రైంబ్యూరో, తొలివెలుగు:దేశంలో ప్రభుత్వం తరఫున ఔషధాల తయారీ కోసం ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ను 1960-62 మధ్య కాలంలో ఏర్పాటు చేశారు. రిషికేష్, గురుగావ్, హైదరాబాద్, చెన్నై, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో భారీగా భూములను తీసుకుని నిర్మించారు. ఎన్నో వ్యాధులకు మందులను ఇక్కడ నుంచే సరఫరా చేసేవారు. ఇక్కడ 100 రూపాయల ట్యాబ్లెట్ 10 రూపాయలకే తయారయ్యేది. కానీ, నిర్వహణ ఖర్చు భారీగా ఉందంటూ నష్టాలను భరించలేమని 2016లో కేంద్రం వాటన్నింటినీ మూసి వేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అప్పటికే గురుగావ్, హైదరాబాద్, బిహార్ కంపెనీలు సిక్ అయ్యాయి. కొన్నింటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్వహించుకుంటున్నాయి. ఐడీపీఎల్ ఉద్యోగులకు సెటిల్మెంట్స్, రావాల్సిన, ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించే బాధ్యత కోసం మిషనరీని అమ్మేయడం, భూములను కేంద్రీకరించి ఎలా వ్యాపారం చేసుకోవాలో నిర్ణయించేందుకు కమిటీలు వేశారు. అయితే.. హైదరాబాద్ స్క్రాప్ వేలంలో బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిజాలు ఏంటో ప్రజల ముందు ఉంచేందుకు తొలివెలుగు క్రైంబ్యూరో ఇన్వెస్టిగేషన్ చేసింది.
జరిగింది ఇదే..!
2018లో డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ఆదేశాల మేరకు ఐడీపీఎల్ సామాగ్రి విలువ ఎంతో తేల్చాలని రిజిస్ట్రార్ వాల్యువేటర్స్ ను టెండర్స్ రూపంలో పిలిచారు. అందులో భువనేశ్వర్ కు చెందిన హరిప్రియ అసోసియేట్స్ హైదరాబాద్ కంపెనీల విలువను లెక్కించే టెండర్ దక్కించుకుంది. మొత్తంగా సామాగ్రి విలువ రూ.19 కోట్ల 13 లక్షలని తేల్చింది. దానిలో 2008లో రూ.15 కోట్లతో కొనుగోలు చేసిన మిషనరీకి కూడా రూ.5 కోట్లుగా లెక్కగట్టింది. ఈటీపీ సెంటర్, బస్సులకు మరో రూ.3 కోట్లు అని అంచనా వేసింది. రూ.11 కోట్లకు మిషనరీ తరుగుదలతో అంచనాకొచ్చింది. మిషనరీ పనితీరుపై ఇచ్చిన విలువ రిపోర్టులతో వేలానికి వెళ్లారు.
42 ప్లాట్స్ లో పనిచేయకుండా ఉన్న స్టీల్ వందల టన్నులుగా వుంటుంది. ఈ స్టీల్ ధరను గతంలో ప్రైవేట్ వ్యాలువేటర్ తో లెక్కిస్తే రూ.250 కోట్లని తేల్చారు. ఆ ప్రకారం చూస్తే కిలో 40 రూపాయలుగా అమ్మే సాధారణ స్క్రాప్ ని వీరి లెక్కల ప్రకారం 5 నుంచి 7 రూపాయలకు మించలేదని అంటున్నారు. హరిప్రియ ఇచ్చిన విలువలతోనే 2019లో ఐడీపీఎల్ కార్యాలయం మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ను సంప్రదించింది. దీంతో ఈ ఆక్షన్ కు వెళ్లారు. ఈ ఏడాది ఎప్రిల్ 10 నుంచి 26 వరకు 44 కంపెనీలు వచ్చి ఐడీపీఎల్ ను విజిట్ చేశాయి. 33 కంపెనీలు 27న టెండర్స్ లో పాల్గొన్నాయి. హెచ్1 బిడ్డర్ ఏడీపీఎస్ ఇంజనీర్స్ మొత్తం రూ.67 కోట్లకు వేలం పాడుకున్నారు.
ఏప్రిల్ 29 వరకు అందులో 25 శాతం డబ్బులు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంది. వేల టన్నులు ఉండే స్క్రాప్ కి 11 కోట్లు విలువ కట్టిన హరిప్రియ అసోసియేట్స్ కు బీజేపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వ్యాల్యువేటర్ కు ఇచ్చిన దానికి బిడ్డర్స్ కు మధ్య రెండింతలు ఎక్కవగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఐదింతలు ఎక్కువగా వేలం పాడినా ఇంకా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. పాత కంపెనీలను మూసివేసేందుకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉండే ఐడీపీఎల్ మూవబుల్ ఆస్తులను ఇలానే రెండు, మూడింతలు ఎక్కువగా వేలంలో పాడుకున్నారు. పేరుకు ఈ-ఆక్షన్ అంటున్నా.. బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. రష్యా నుంచి తెచ్చిన జీవిత కాలం పనిచేసే ప్రత్యేక మెటీరియల్ ఈ కంపెనీల్లో ఉంది. మిషన్స్, మోటార్స్ నిర్వహణతో పవర్ బిల్లు ఎక్కువ అయినా వాటి పనితీరు ఇప్పటి టెక్నాలజీలకు మించి ఉంటుందని అంటున్నారు.
భూములు ముమ్మాటికీ రాష్ట్రానివే.. అయినా ఏదో జరుగుతోంది..!
1962లో ఐడీపీఎల్ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం 891 ఎకరాలను కేటాయించింది. ఆ భూమి రాష్ట్రానికి చెందినది. డెవలప్ మెంట్, నిర్వహణ కేంద్ర ప్రభుత్వానిది. అయితే.. 1995లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా మారడంతో కేంద్ర ప్రభుత్వానికి కన్వేయన్స్ డీడ్ చేయించి ఇచ్చారు. భూమిని తనఖా పెట్టుకుని డబ్బులు తీసుకున్నారు. లయబిలిటీస్ లో భాగంగా కేంద్రం డబ్బులు చెల్లించి బ్యాంకు రుణాలు క్లోజ్ చేయించిందని హైదరాబాద్ ఐడీపీఎల్ జీఎం వై రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ, రూ.700 కోట్ల అప్పులు చెల్లించినందుకుగాను నేషనల్ ల్యాండ్ మోనటైజ్ కార్పొరేషన్ హైదరాబాద్ భూములను వారే నిర్వహించేలా ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం.
కన్వేయన్స్ డీడ్ లో ఔషధాల తయారీ లేదా వాటి అనుబంధ సంస్థకు మాత్రమే ఈ స్థలాన్ని కేటాయించాలని ఒప్పంద పత్రాల్లో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు వివిధ కార్యక్రమాలకు కేటాయించాలని అనుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉండి అడ్డుకుంది. 50 ఎకరాలు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ రీసెర్చ్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అయితే.. నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ ద్వారా ఐడీపీఎల్ ల్యాండ్స్ అన్నింటినీ ఎలాగైనా దక్కించుకుని పీపీపీ పద్దతుల్లో భారీగా నిధులు చేకూర్చుకునేలా సిద్ధమైనట్టు తెలుస్తోంది. గుర్గావ్ ఐడీపీఎల్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధమైనట్టు సమాచారం. అయితే.. నిజాం రాజు నుంచి వచ్చిన ప్రభుత్వ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.
మరోవైపు ఒప్పందాల్లో ఔషధాలు, ఫార్మాస్యుటికల్స్ కు తప్ప మరెలాంటి వాటికీ భూమిని ఉపయోగించరాదనే నిబంధనలతో ఒప్పందాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రూ.50 వేల కోట్ల భూమి తమదే అని అంటోంది. 891 ఎకరాల కంటే ఎక్కువ భూమిలో పొజిషన్ లో ఉన్నామంటూ స్థానికులు కబ్జాలు పెడుతున్నారు. భూ సర్వే చేయాలని కంపెనీ జీఎం కోరుకున్నా ప్రభుత్వం చేయించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల 30 ఏండ్ల నుంచి సుమారు 70 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్టు తెలుస్తోంది.