ఈమధ్య దొంగలు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రాత్రి సమయాల్లో అందరూ నిద్రపోయాక చోరీలు జరిగేవి. కానీ.. ఇప్పుడు పట్టపగలే దోచేస్తున్నారు. ఆయుధాలు ఉన్నాయన్న ధైర్యంతో వారు చేస్తున్న పనులు ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో అదే జరిగింది.
పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ నగల దుకాణంలో చోరీకి యత్నించింది దొంగల ముఠా. హరిద్వార్‌లోని రాణిపూర్ కొత్వాల్ లో ఇది జరిగింది. అయితే.. యజమాని ఎదురు తిరిగే సరికి ముఠాకు ఏం చేయాలో పాలుపోలేదు.
నాటు తుపాకులతో లోపలికి వచ్చిన ఆరుగురు దొంగలు.. షాపు యజమానిపై దాడి చేశారు. కానీ.. అతను మాత్రం వారిని ధైర్యంగా ఎదుర్కొని దొంగల చేతికి ఏమీ అందకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలో ఐదుగురు దుండగులు పారిపోగా, ఒకడు మాత్రం దొరికిపోయాడు. స్థానికులు చుట్టుముట్టి అతడి రెండు చెంపలు వాయించి.. పోలీసులకు సమాచారం అందించారు.
దొంగను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. చోరీ దృశ్యాలన్నీ షాపులో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అవ్వగా.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.