సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ఐపీసీ, 5(2) (వీ), ఎస్సీ, ఎస్టీ, పీఓఏ యాక్ట్ 2015 కింద కేసులు పెట్టారు. ముసారాంబాగ్ కు చెందిన నిందితుడు.. తనంతట తానే పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో అతను సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు.. పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు.
నిందితుడి వాంగ్మూలం ప్రకారం.. ”నవీన్, నేను దిల్ సుఖ్ నగర్ లో ఇంటర్ కలిసి చదువుతున్నాం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి నాకు దూరం అయ్యింది. ఆ తర్వాత నవీన్, ఆ అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి కూడా నవీన్ తో క్లోజ్ గా ఉండేది. నేను లవ్ చేసిన అమ్మాయిని.. నా ఫ్రెండ్ ప్రేమించడం తట్టుకోలేకపోయాను. అందుకే నవీన్ ని చంపాలని నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పాడు కృష్ణ.
‘‘ఫిబ్రవరి 17న నవీన్ కి ఫోన్ చేసి పార్టీ ఉంది రమ్మని చెప్పాను. ఇద్దరం కలిసి పెద్ద అంబర్ పేట్ కి చేరుకున్నాం. అక్కడ మా ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. అప్పుడు నేను, నవీన్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కత్తితో దాడి చేసి హత్య చేశాను. ఆ తర్వాత అతని తల, గుండె, చేతివేళ్లు, ఇంకా మిగతా భాగాల్ని కత్తితో వేరు చేశాను” అని కృష్ణ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా.. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవీన్ హత్య విషయాన్ని ఆ అమ్మాయికి కృష్ణ ఫోన్ చేసి తెలియజేసినట్టు విచారణలో తేలింది. నవీన్ శరీర భాగాలను ఫొటోలు తీసి పంపగా.. అవి చూసి ‘గుడ్ బాయ్’ అంటూ ఆ అమ్మాయి సమాధానం ఇచ్చింది. దీంతో ఆ అమ్మాయిని కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చబోతున్నట్లు తెలుస్తోంది.