పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ భీమ్లా నాయక్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విజయవంతమైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో పవన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో పవన్ తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెట్టారు. అటు రాజకీయంగా కూడా బిజీగా ఉంటున్న పవన్, దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రం చేస్తున్నారు.
ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితా తాజా విషయమేమిటంటే.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. కాగా ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్‌కల్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఓ టీజర్ పవర్‌స్టార్ అభిమానులను తెగ ఖుషీ చేసింది.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనువిందు చేయనుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం చాలా రోజుల తర్వాత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రారంభమైంది. అయితే ఇప్పుడు నెట్టింట్లో పవన్ ‘హరిహర వీర మల్లు’ సెట్లో ఉన్న పిక్స్ వైరల్ అవుతోన్నాయి. ఇందులో పవన్ సరికొత్త లుక్‌లో ఫిట్‌గా కన్పిస్తున్నారు. ఈ పిక్స్ చూస్తుంటే భారీ యాక్షన్ సన్నివేశాలకు రంగం సిద్ధమైనట్లు కన్పిస్తోంది. స్టంట్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన ప్రాక్టీసు మొదలెట్టారు పవన్.
ఇక ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసి పవన్ కళ్యాణ్ ‘వినోదయ సీతం’ తెలుగు రీమేక్‌పై దృష్టి పెట్టనున్నారు. ‘హరిహర వీర మల్లు’ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.