ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత డైజేషన్ కోసం అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు వాకింగ్ చేస్తే.. ఇంకొందరు సోనీ లాంటివి నములుతుంటారు. కానీ.. ఉత్తరప్రదేశ్ చెందిన ఓ వ్యక్తి చేసే పని చేస్తే అవాక్కవ్వాల్సిందే. భోజనం చేసిన తర్వాత రోజూ ఒక పిరికెడు ఇసుక తినడం అతనికి అలవాటు అని చెప్తున్నాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరిలాల్ సక్సేనా అనే వలస కూలీ పదేళ్ల కిందటే.. ఉపాధి కోసం ఒడిశాకు వచ్చాడు. గంజాం జిల్లాలోని కిర్తిపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. హరిలాల్.. 40ఏళ్లగా రోజూ ఒక పిడికెడు ఇసుక తింటున్నాడు. యూపీలోని అరంగాపూర్ లో పుట్టిన ఈయనకి చిన్నప్పటినుంచే ఇసుక తినడం అలవాటుగా మారింది. ఇతరులు తమకిష్టమైన ఆహార పదార్థాలతో భోజనం చేస్తే ఎంత తృప్తి పడతారో తనకు ఇసుకు తింటున్నప్పడూ అంతే సంతోషం కలుగుతుందని హరిలాల్ చెప్తున్నాడు.
భోజనం చేసిన తర్వాత లేదా భోజనానికి ముందు ఇసుక తినడం అలవాటుగా మారిందని హరిలాల్ అంటున్నాడు. తమ గ్రామానికి దగ్గర్లోనే నది ఉండడం వల్ల.. చిన్నతనంలో రోజూ ఆ నది ఒడ్డుకు వెళ్లి ఇసుక తినేవాడిని అంటున్నాడు. వర్షాకాలం వస్తే ముందుగానే ఇసుక బస్తాలను సేకరించి ఇంట్లో నిల్వ ఉంచుకుంటునంటున్నాడు హరిలాల్. అయితే.. ఒకప్పడు విపరీతంగా తినేవాడినని.. అన్నమే తినకపోయేవాడినని.. ఇప్పడు కాస్త తగ్గిందంటున్నాడు.
ఇసుక తిన్న తర్వాత కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు రాలేదని తెలిపాడు. ప్రస్తుతం ఒడిశాలో నివాసముంటున్న ఇతడ్ని మొదటిసారి ఇసుక తినడం చూసి ఆశ్చర్యపోయామని తోటి కార్మికులు, స్థానికులు చెప్తున్నారు. తింటే ప్రమాదమని చెప్పినప్పటికీ.. హరిలాల్ ఇసుక తినడం మాత్రం మానలేదంటున్నారు. అయినప్పటికీ..అతను చాలా ఆరోగ్యవంతంగా ఉంటూ చాలా యాక్టివ్ గా పని చేస్తారని అంటున్నారు తోటి కార్మికులు.