సీఎం కేసీఆర్‌పై మంత్రి హరీష్ రావు చాడీలు చెబుతున్నారు. కేసీఆర్ చేయని పనులను కూడా ఆయనకు ఆపాదిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. దొడ్డు వడ్ల సంగతి తేల్చుకునే వస్తారని పదే పదే పలు వేదికలపై ప్రకటించారు హరీష్ రావు. పంటలు కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని.. అందుకే కేంద్రంతో తాడోపేడో తేల్చుకొస్తారని వీర లెవెల్లో డైలాగులు చెప్పారు. అది విన్నవారంతా నిజమేననుకున్నారు. ఉన్నట్టుండి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారంటే.. దొడ్డు వడ్లు సంగతి తేల్చేందుకేనేమోనని అనుకున్నారు.
రాష్ట్రంలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తున్నా.. అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నా.. సాగు చట్టాలపై భారత్ బంద్ పిలుపు ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారంటే కచ్చితంగా దొడ్డు వడ్లపై శుభవార్తతోనే తిరిగి వస్తారని అంతా ఊహించుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ ఎప్పుడని రైతులు టీవీల ముందే కూర్చున్నారు. రోజులు గడిచాయి కానీ.. ఆ సీన్ అయితే కనిపించలేదు. కట్ చేస్తే.. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మంగళవారం తిరిగి హైదరాబాద్ వచ్చారు కానీ దొడ్డు వడ్ల సంగతి మాత్రం తేల్చలేదు.
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు కానీ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని మాత్రం కలవకుండానే వచ్చేశారు. దీంతో దొడ్డు వడ్లపై తేల్చడం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని నాలుగైదు రోజులుగా హరీష్ రావు చెప్పిన మాటలు విన్నవారంతా.. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. హరీష్ రావు చెప్పిందేంటి.. కేసీఆర్ చేసిదేంటి అని ప్రశ్నిస్తున్నారు. మామను కవర్ చేయడానికి అల్లు హరీష్ జాకీలు బాగానే లేపుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. అవునూ.. ఇంతకి కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది దొడ్డు వడ్ల సంగతి తేల్చేందుకు కాదా?