రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందంటున్న మోడీ.. రాష్ట్రానికి ఆయనేం చేశారని ప్రశ్నించారు. హుస్నాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు హరీష్. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంతమంది బలయ్యేవాళ్లు కాదన్నారు. బలిదానాలకు బీజేపీ, కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.
ఏడు మండలాలను ఏపీలో కలిపేటప్పుడు కనీసం చెప్పలేదన్నారు హరీష్. విభజన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
యూపీ ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతారని అనుమానం వ్యక్తం చేశారు హరీష్. సబ్సిడీల్లో కోత, ధరల పెంపు, వివక్ష తప్ప బీజేపీ నేతృత్వంలోని కేంద్రం దేశ ప్రజలకు చేసేందేమీ లేదని విమర్శించారు. కర్నాటక, ఏపీలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చి తెలంగాణకు మొండిచేయి చూపిస్తోందని ఫైరయ్యారు.
తెలంగాణ సర్కార్ రైతును కాపాడే ప్రయత్నం చేస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం రైతును ముంచేందుకు చూస్తోందని విమర్శించారు హరీష్. టీఆర్ఎస్ నాయకులు ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పిలుపునిచ్చారు.