ఆ ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన వారు. ఆ ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు. ఆ ఇద్దరు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతున్న నాయకులు. కానీ ఆ ఇద్దరు ఇప్పుడు తెర వెనుక నాయకుల్లా మిగిలి పోయారు. ఇంతకీ ఎవరా ఇద్దరు?????
ఆర్టీసి సమ్మె ఉదృతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఆర్టీసి కార్మికులు తగ్గేదే లేదంటున్నారు. చర్చలు జరపండని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా చీమ కుట్టినట్లు కూడా లేదు ప్రభుత్వానికి. ఇంతా జరుగుతుంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు , ఈటెల రాజేందర్ మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనుక కారణమేంటి? మేధావులు మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆర్టీసి నాయకులు అంటున్నారు. అయినా స్పందన లేదు.
హరీష్, ఈటెల సొంత నియోజకవర్గాల్లో బిజీ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తల మీటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఏ మీటింగ్ లోనూ ఆర్టీసి కార్మికుల ప్రస్తావనే లేదు. మాకెందుకు లే అనుకుంటున్నారా? లేక కేసిఆర్ పై తిరుగుబాటు చేస్తున్నారా??
ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు మేమే అని గర్జించిన ఈటెల కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు. 50 వేల ఆర్టీసి కుటుంబాల కార్మిక వేదన వీరికి వినపడట్లేదా అంటున్నారు ఆర్టీసి కార్మికులు. ఇక మొన్నటి వరకు టీఎంయు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. కచ్చితంగా రాజకీయ కారణాలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీలో కిరాయి దార్లు, ఓనర్లు అనే చర్చ నడుస్తోంది. దీన్ని బట్టి ఆర్టీసి ఉద్యోగులకు సపోర్ట్ గా మాట్లాడితే కేసిఆర్ కు కోపం వస్తుంది. అనవసరంగా ఎందుకు… మౌనమే అన్నింటికీ పరిష్కారమని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. కానీ సమ్మె సామరస్య పూర్వకంగా ముగిస్తే ఈ ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇదే తీరులో ప్రభుత్వ వైఖరి కొనసాగి పరిస్థితి చేయి దాటితే తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.