హైదరాబాద్: హరీశ్‌రావు అను నేను.. అంటూ కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్‌రావు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత హరీశ్ వెళ్లి కేసీఆర్ పాదాలకు వంగి నమస్కారం చేయబోతుండటం కనిపించింది. హరీశ్ తరువాత వరుసగా కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హరీశ్‌రావు, కేటీఆర్ ఒకేకారులో రావడం విశేషం.
కేటీఆర్ ప్రమాణ స్వీకారం
మూడోసారి మంత్రిగా హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కాకుండానే మొదటిసారిగా మంత్రి పదవి చేపట్టిన హరీశ్ తర్వాత తెలంగాణ తొలి కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ రెండో ప్రభుత్వంలో ఇప్పుడు మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు.