ఔను! హరీష్‌రావు మళ్లీ మొదలుపెట్టారు. ఒకప్పుడు రాష్ట్రం మొత్తం ఓ వెలుగు వెలిగిన హరీష్‌రావు.. తర్వాత సిద్ధిపేటకే పరిమితం అయ్యారు. కేసీఆర్ కుటుంబంలో మనస్పర్ధలున్నాయని, హరీష్‌ను పూర్తిగా పక్కనపెట్టేశారని యావత్ తెలంగాణ కోడై కూసింది. దానికి హరీష్‌రావు ఒకటీ రెండు సందర్భాల్లో చేసిన వాఖ్యలకు తోడు ఇతర పార్టీల నేతలు చేసిన మాటలూ అన్నీ కలిపి… మేటర్ కాస్తా పెద్దదైంది.
అందులో నిజం కూడా లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో అంటే మంత్రి పదవి లేదు కాబట్టి తిరగలేక పోయారు. పార్టీ పదవి లేదు కాబట్టి పెద్దగా వార్తల్లో లేరు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఆయన పర్యటించలేదు. అంతేందుకు పక్కనున్న గజ్వేల్ వైపు కూడా హరీష్‌రావు కన్నెత్తి చూడలేదు. పూర్తిగా సిద్ధిపేటకే పరిమితమయ్యారు. అన్ని పేపర్ల ఫ్రంట్ పేజీల నుంచి, పతాక శీర్షికల స్థాయి నుంచి టీఆర్ఎస్ సొంత పత్రికలో కనీసం టాబ్లయిడ్‌లో కూడా చోటు దక్కకుండా అయిపోయారు. ఇక హరీష్ పని అయిపోయిందని ఆయన వర్గం నేతలు కూడా ఆయనవైపు వెళ్లని స్థితిలో అనూహ్యంగా హరీష్‌కు మళ్లీ మంత్రిపదవి దక్కింది.
కానీ, ‘ఈసారి గతంలో లాగా రాష్ట్ర పర్యటనకు చోటు లేదు. ఆర్థికమంత్రిగా అన్నీ తనతోనే జరిగినా తను మాత్రం అధికారికంగా ఎక్కడకు వెళ్లలేరు. దాంతో ఆయన ఇంటికే పరిమితమవుతారు…’ అని అంతా అనుకున్నారు.
అందరి అంచనాలకు భిన్నంగా ఇప్పుడు జిల్లా ఇంచార్జీ మంత్రిగా హరీష్ ఉమ్మడి మెదక్ జిల్లాను చుట్టేస్తున్నారు. గజ్వేల్ సహా ఉమ్మడి మెదక్ వరకు అంతా తానే అయి పర్యటిస్తున్నారు. సమీక్షలు, ఓపెనింగ్‌లు అంటూ హడావిడి చేస్తున్నారు. కాస్త అవకాశం దొరికితే చాలు… హరీష్ రావు అంటే ఏంటో చూపించడానికి అంటూ అతని అనుచర వర్గం ఎంతో సంతోషంగా ఉంది. చూడాలి మరీ.. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేక మళ్లీ కత్తిరింపులు మొదలవుతాయో. ఎక్కడా తిరగకుండా వుండటానికే ఆర్థికమంత్రిత్వ శాఖ ఇచ్చిన కేసీఆర్.. ఇఫ్పుడు హరీశ్ మళ్లీ విశ్వరూపం చూపిస్తే గమ్మున కూర్చుంటారా.. అని అంటున్నారు విశ్లేషకులు.