మంత్రి హరీష్ రావు హుజురాబాద్ కు మకాం మార్చేసేలా ఉన్నారు. ఉప ఎన్నిక ఎప్పుడో తెలియక పోయినా… సొంత జిల్లా నేతలు చూసి చూడనట్లుగా వదిలేసినా హరీష్ రావు మాత్రం హుజురాబాద్ లోనే ఉండిపోవాల్సి వస్తుంది. చుట్టం చూపుగా మాత్రమే సిద్దిపేటకు వస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు.
అయితే, హుజురాబాద్ లోనూ హరీష్ రావు సాదాసీదా ప్రచారం చేయటం లేదు. హరీష్ రావు ప్రచారం ఇప్పుడు కులాల వారీగా టర్న్ తీసుకుంది. రెడ్డి, పద్మశాలి, ముదిరాజ్ మీటింగ్స్ అంటూ హరీష్ రావు హడావిడి చేస్తున్నారు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీలో ఆ కులాల నుండి వచ్చిన పెద్ద లీడర్లను రప్పిస్తున్నారు.
అయితే, తాజాగా జరిగిన రెడ్డి మీటింగ్ వరకు తెర వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు రహస్యంగా సర్వేలు చేయిస్తుంది. ఇంటలిజెన్స్ ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటుంది. ఈ రిపోర్ట్స్ లో ఏయే కులాలు టీఆర్ఎస్ కు వ్యతిరేకం అని ఆరా తీయగా రెడ్డిలంతా ఈటల వైపే ఉన్నారని తేలిపోయిందని, అందుకే రెడ్డి మీటింగ్ పెట్టారని ఇన్ సైడ్ టాక్. హరీష్ రావు అక్కడే ఉండి సర్వేల ఆధారంగా టీఆర్ఎస్ కు పనులు చక్కపెట్టే పని చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.