ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
మెడ మీద కత్తి పెట్టినా వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్తున్నారని అన్నారు. విద్యుత్ సంస్కరణలు చేస్తేనే రాయితీలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని చెప్పారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 40 వేల కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ అంటుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రాజెక్టులు ఇస్తున్నారని, తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ ఎందుకు సడిచప్పుడు కాకుండా ఎందుకు ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు.