18న జరిగే ఖమ్మం సభ చారిత్రాత్మక సభ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ అని ఆయన పేర్కొన్నారు. వంద ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. పార్కింగ్ కోసం 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు.
వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. నియోజక వర్గాల వారీగా ఇన్ చార్జిలను నియమించి జన సమీకరణ చేస్తున్నామన్నారు. 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జన సమీకరణ చేస్తున్నామన్నారు. ఈ సభకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
సభకు వాహనాలు దొరకడం లేదన్నారు. పక్క రాష్ట్రాల నుంచి బస్సులు,వాహనాలు సమకూరుస్తున్నామన్నారు. ముఖ్య అతిధులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు,నేతలు వేదికపై ఉంటారని వివరించారు. రేపు రాత్రికి ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకుంటారని చెప్పారు.
ఎల్లుండి 18 న ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారన్నారు. యాదాద్రి దర్శనం చేసుకొని రెండు హెలి కాప్టర్లలో ఖమ్మం చేరుకుంటారని పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఖమ్మం కలెక్టరేట్ లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారన్నారు.
కంటి వెలుగు ప్రారంభమైన తర్వాత కలెక్టరేట్ లో నలుగురు ముఖ్యమత్రులు భోజనం చేస్తారని, సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుందన్నారు. కళా కారులకు ప్రత్యేక వేదిక ఉంటుందని చెప్పారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.