ఏడేళ్ల మోడీ పాలనపై చర్చకు సవాల్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు టీఆర్ఎస్ నేతలు. వరుసబెట్టి మీడియా ముందుకొచ్చి విమర్శలు చేస్తున్నారు. అమరవీరుల స్థూపం తాకే అర్హత కిషన్ రెడ్డికి లేదన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజల పక్షాన నిలబడి ఆనాడు తామంతా తెలంగాణ కోసం రాజీనామా చేస్తే.. ఆయన మాత్రం పదవి కోసం పాకులాడారని ఆరోపించారు.
అసలు.. కేసీఆర్ తో చర్చ జరిపే స్థాయి కిషన్ రెడ్డికి లేదన్నారు హరీష్. కేసీఆర్ ను విమర్శించడం పక్కనబెట్టి దమ్ముంటే తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కేసీఆర్ మాట్లాడేది ప్రజల భాష అని చెప్పిన హరీష్.. ఎఫ్‌సీఐకి బడ్జెట్ లో రూ.65 వేల కోట్లు కోత పెట్టారని గుర్తు చేశారు. అలాగే ఉపాధి హామీకి రూ.25 వేల కోట్లు తగ్గించారని చెప్పారు. వీటన్నింటిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
జై ఆంధ్రా ఉద్యమానికి కిషన్ రెడ్డి నాయకత్వం వహిస్తానని గతంలో ట్వీట్ చేశారని చెప్పారు హరీష్. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆయన కేంద్రమంత్రి అయ్యారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్ లో అమిత్ షా బ్లాక్ డేగా అభివర్ణించారని.. అమరుల గురించి మాట్లాడే నైతికత కిషన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు.
ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్ పెరగాలని కేసీఆర్ కోరారని.. హైదరాబాద్ కు వరదలు వస్తే కేంద్రం చేత నిధులేమైనా ఇప్పించారా? అని నిలదీశారు. తెలంగాణకు ఒక్క ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదని.. ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా? అంటూ ఎదురుదాడి చేశారు హరీష్ రావు.