కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానాలు రైతులను అవమానించేలా ఉన్నాయన్నారు. యాసంగి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతుల్ని అవమానపరిస్తే సహించేది లేదని.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే నూకలు తినైనా.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని వ్యాఖ్యానించారు.
దేశం మొత్తం ఒకేరకమైన పరిస్థితులు ఉండవని.. కేంద్రం ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ తరహా వాతావరణం తెలంగాణలో ఉండదని గుర్తు చేశారు. అక్కడ విత్తన ధాన్యాలు పండిచడం సాధ్యమా..? అని ప్రశ్నించారు.
రా రైస్ ఇవ్వాలని మెలిక పెట్టకుండా.. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేస్తున్నారని ఆరోపించారు. డబ్ల్యూటీవో నిబంధనలను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు హరీష్ రావు.