బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. నడ్డా ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని ఎద్దేవ చేశారు. సోమవారం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. నడ్డాకు ధమాక్ లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.
తెలంగాణ అభివృద్ధిని నితిన్ గడ్కరీ ప్రశంసిస్తే.. జేపీ నడ్డా విమర్శించారని, ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు రెండు రకాలు మాటలు మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ సస్యశ్యామలం అయిందని గడ్కరీ అంటే.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఒక్క ఎకరం పారలేదని నడ్డా అంటున్నారని హరీశ్ రావు అన్నారు. దీని బట్టి చూస్తే జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అంటూ ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి పదవికి రేటు కట్టిన పార్టీ బీజేపీ అని ఎద్దేవ చేశారు. బీజేపీ నేతలు జూట మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో సీఎం పదవి కోసం బీజేపీకి రూ.2500 కోట్లు ఇవ్వాలట ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. కాంగ్రెస్ పాలన అంటేనే కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ లో ఉండేది కేవలం కుర్చీల కొట్లాటే తప్ప ప్రజలకు మేలు కోసం ఆలోచననే లేదని ఆరోపించారు.