మోడీ సర్కార్‌పై తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బావుల కాడ మీటర్లు పెట్టలేదని రూ. 30వేల కోట్ల నిధులను కేంద్రం ఆపిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మీటర్లు పెడితామని సంతకం చేస్తేనే రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెబుతోందన్నారు.
కానీ దానికి సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. దేశంలో ఒక మన రాష్ట్రంలో తప్ప ఎక్కడ చూసినా బోరు బావులకు మీటర్లు పెట్టారని వెల్లడించారు. రైతుల ఇంటి వద్దకు బిల్లు పంపారన్నారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
కరోనా సమయంలో ఉద్యోగుల, ఎమ్మెల్యేల జీతాలను ఆపి మరి రైతులకు రైతుబంధు వేశామన్నారు. రైతులు వినిగియోస్తున్న ట్రాక్టర్లకు పన్ను కూడా రద్దు చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తూప్రాన్‌లో మూడు మార్కెట్లు వచ్చాయన్నారు.
గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వారు కనీసం ఒక్క మార్కెట్ కూడా తేలేదన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముప్పిరెడ్డి పల్లికి చెందిన 379 మంది భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు.