గారడి చేస్తుండ్రు.. గడిబిడి చేస్తుండ్రు.. తొండికి దిగుతండ్రు.. మొండికి పోతుండ్రు.. ఈ వాక్యాలు ఎక్కడివో తెలుసు కదా.. గతంలో ఓ సినిమా కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రాసిన ఓ పాటలోని లైన్లు ఇవి. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ వాసులు మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుని మరీ ఈ పాటను పాడుకుంటున్నారు.
ఉప ఎన్నిక వేళ కేసీఆర్ చేస్తున్న గారడీని చూసి.. జనం గాబరా అవుతున్నారు. ఆగమేఘాల మీద అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతోంటే ఆశ్చర్యపోతున్నారు. మళ్లీ మళ్లీ గిల్లి చూసుకుంటున్నారు. అయితే ఎంత ఉప ఎన్నిక హడావుడిలో ఉన్నా.. అధికార పార్టీ నేతలు కొన్నిసార్లు అతి తెలివితేటలు చూపిస్తోంటే.. ఏడ్వలేక నవ్వుతున్నారు ప్రజలు. అలా తాజాగా మంత్రులు హరీష్ రావు, గంగుల కలిసి చేసిన ఓ పని ఇప్పుడు హుజూరాబాద్‌లో పెద్ద జోక్‌గా మారిపోయింది. ఏ నలుగురు కలిసినా.. ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుని తెగ నవ్వుకుంటున్నారు.
ఆటోనగర్ ఏర్పాటు కోసమని తాజాగా హుజురాబాద్‌లో ఓ చోట శంకుస్థాపన చేశారు మంత్రులు హరీష్, గంగుల. సాధారణంగా శంకుస్థాపన అంటే.. ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, దాని ముందు ఓ కొబ్బరికాయ కొట్టి తంతును జరిపిస్తుంటారు. శంకుస్థాపన తర్వాత ఆ అభివృద్ధి పని ముందుకు సాగుతుందా లేక అక్కడితో దాని కథ ముగిసిపోతుందా అన్నది పక్కనబెడితే, శంకుస్థాపన సందర్భంగా వేసిన శిలాఫలకాన్ని మాత్రం ఏళ్ల తరబడి నిలిచిపోయేలా గట్టిగా నిర్మిస్తారు. కానీ ఆటోనగర్ శంకుస్థాపనకు సందర్భంగా మంత్రులు షాకిచ్చారు.
శిలఫలకాన్ని కూడా నిర్మించకుండానే .. గాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటికప్పుడు తయారు చేయించిన శిలఫలకాన్ని నాలుగురైదుగురు వెనక నుంచి చేతిలో పట్టుకోగా.. దాని ముందు నిలబడి మంత్రులు మమ అనిపించారు. దీంతో అది చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా మంత్రులే తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయడంతో.. ఇవి మరింత వైరల్‌గా మారాయి. చూస్తోంటే.. ఉప ఎన్నిక తర్వాత.. శిలఫలకాన్ని మాయం చేసేట్టే ఉన్నారని గుసగుసలాడుకుంటున్నారు.