మలక్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై టి కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. వైద్యం వికటించి బాలింతల ప్రాణాలు పోవడం అత్యంత దారుణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన ఆరోపించారు.
హృదయ విదారకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కనీసం బాలింతలను కాపాడలేకపోతుందని రేవంత్ విమర్శించారు. వైద్యం విషయంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని,ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రైవేట్ వైద్యం ఇక్కడ అభివృద్ది చెందుతోందని ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా.. అని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వ వైద్యం పై పూర్తిగా నమ్మకం పోతోందని కామెంట్ చేశారు.
ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు బాలింతలు చనిపోయారని ఒక్కప్పటి ఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఆగష్టు చివరి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి బాలింతలు మృత్యువాత పడ్డారన్నారు. 4 నెలల్లోనే మళ్లీ ఈ సంఘటన జరిగిందని, హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి.. అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులంటేనే ప్రజలకు భయం వేస్తోందన్న ఆయన.. వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావ్ మాటలకే పరిమితం అయ్యారని ఆరోపించారు.
ఈ సంఘటనకు ఆయనే బాధ్యత వహించి,తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృత్యువాత పడ్డ పేద,బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.