ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్ రావు తీరు మూడు గొప్పలు.. ఆరు గప్పాలు అన్నట్టుగా తయారైందని సెటైర్లు వేస్తున్నారు హుజూరాబాద్ వాసులు. పార్టీ ప్రచారం కంటే.. తన సొంత డబ్బా కొట్టుకోవడమే ఎక్కువైపోయిందని నవ్వుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఆయన్ను కేసీఆర్ మళ్లీ పక్కనబెట్టడం ఖాయమన్న అభిప్రాయాలు సర్వత్రా ఉండటంతో.. ఎందుకైనా మంచిదని హరీష్ రావు క్యాంపెయిన్‌తో పాటు పనిలో పనిగా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారన్న అభిప్రాయలు వినిపిస్తున్నాయి.
మాట్లాడితే చాలు.. సిద్దిపేటలో తనకున్న రికార్డుల గురించే హరీష్ రావు తరచూ ప్రస్తావిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఆరుసార్లు గెలిచానని, తనకొచ్చిన మెజార్టీ ఎవరికీ రాలేదని పదే పదే చెప్పుకోవడం చూస్తోంటే.. పరోక్షంగా కేసీఆర్‌కు హరీష్ రావు తన ట్రాక్ రికార్డును గుర్తు చేస్తున్నారేమో అని గుసగుసలాడుకుంటున్నారు. ఇన్నాళ్లు కనీసం అప్పుడుప్పుడు మాత్రమే తన గొప్పల గురించి చెప్పుకునేవారని, కానీ ఈటల దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ చేసిన తర్వాత.. హరీష్ రావు అతిగా ఆత్మస్తుతి చేసుకుంటున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఆరుసార్లు గెలిస్తే సిద్దిపేటలో హరీష్ రావు గొప్ప అయినప్పుడు.. అదే ఆరు సార్లు గెలిచిన ఈటల కూడా హుజూరాబాద్‌కే గొప్పే అవుతారు కదా అని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా హుజూరాబాద్‌లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం వేదికపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను చూస్తోంటే.. ఆయన తన సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఉప ఎన్నికను ఎంతలా ఉపయోగించుకుంటున్నారో అర్థమవుతోందని అంతా చెప్పుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తే తానే గెలుస్తానని, కానీ సిద్దిపేటకు మళ్లీ ఉప ఎన్నిక అవసరమా అని ఆగిపోతున్నట్టు హరీష్ రావు చెప్పడాన్ని చూసి హుజూరాబాద్ వాసులు ఘోల్లున నవ్వుకుంటున్నారు. సిద్దిపేటలోనే కాదు.. రాష్ట్రమంతా ప్రజలు ఉప ఎన్నికను కోరుకుంటున్నారన్న విషయాన్ని హరీష్ రావు మరిచిపోతున్నారేమోనని గుర్తు చేస్తున్నారు.
ఇక యువకుడైన గెల్లు శ్రీనివాస్ చేతిలో ఓడిపోతానన్న భయంతోనే ఈటల ప్రతీసారి తనను పోటీకి రమ్మంటున్నారని, పెద్ద నాయకుల చేతిలో ఓడిపోతే బాగుంటుందనే ఉద్దేశం ఆయనకు ఉందని హరీష్ చెబుతోంటే.. తాను టీఆర్ఎస్‌లో పెద్దవాడినని తానే చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని జాలిపడుతున్నారు హుజూరాబాద్ వాసులు.