వరంగల్ జిల్లాలోని పర్వతాల ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ సహా పలువురు నేతలు, భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. అందరి సమక్షంలో లింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత లింగాభిషేకాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. పర్వతాల శివాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆలయం గురించి సీఎం కేసీఆర్ కు వివరిస్తామని చెప్పారు. పురాతన ఆలయాన్ని పునరుద్దరించడం వంద కొత్త ఆలయాలు కట్టడంతో సమానమని తెలిపారు. ఇది కాకతీయుల పురాతన శివాలయమని.. తిరిగి కట్టడం గొప్ప విషయమన్నారు.
కేసీఆర్ నిజమైన హిందువన్నారు హరీష్ రావు. కొంతమంది హిందువులంటూ ప్రచారం చేసుకుంటారు కానీ.. కేసీఆర్ హిందూధర్మ ప్రచారకుడని చెప్పారు. ఎన్నో దేవాలయాలను ఆయన కాపాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు హరీష్ రావు.
పర్వతగిరిలో కాకతీయులు ఆరాధించి, ప్రతిష్టించిన ఇక్కడి శివలింగానికి పున:ప్రతిష్ఠాపన చేశారు. ప్రకృతి రమణీయ పర్వతాల గుట్టపై భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. అభిషేకాలు జరిపారు. శివ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. పర్వతగిరి ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.