వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్లలో చేసి చూపించారని తెలిపారు. వైద్యరంగాన్ని బలోపేతం చేశారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, తాము ఒక్క ఏడాదిలోనే 8 వైద్య కళాశాలలు ప్రారంభించామన్నారు.
నాడు 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత 2790కి పెంచుకున్నామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మెడికల్ కాలేజీలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్ రావు సమాధానమిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 4 మెడికల్ కాలేజీలు వచ్చాయని, వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తామన్నారు. ప్రతిపక్ష సభ్యులన్న సంగారెడ్డి, ములుగులోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నదని, కానీ రాష్ట్రానికి మాత్రం ఒక్క కాలేజీని కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేశారు. అక్కడ వసతులు లేవని విమర్శించారు. ఐపీ లేదు, ఓపీ లేదు, ఆపరేషన్లు చేయరన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ చేసే అవకాశం కల్పించామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల్లో సీట్లు మూడింతలు పెరిగాయన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారామెడికల్ కాలేజీల్లో అనేక కోర్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉపయోగించే ఎయిర్ సాంప్లార్స్‌ను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉపయోగిస్తున్నామని చెప్పారు. నెల రోజుల్లోగా 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేసి, మెడికల్ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా చూస్తామన్నారు. ఈ ఏడాదిలోనే మెదక్‌కు మెడికల్ కాలేజీ మంజూరు చేయనున్నామని వెల్లడించారు. అవసరమైన ప్రతిచోట పల్లె, బస్తీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామారు.