బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి భూములు, భవనాలు ఇచ్చినప్పటికీ.. కేంద్రం నుండి ఎలాంటి సపోర్ట్ లేదని అసంతృప్తి తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇంత పెద్ద సంస్థలో 20 మంది ఐపీ పేషెంట్లు మాత్రమే ఉండటం దారుణమని విచారం వ్యక్తం చేశారు.
ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లినికల్ ప్రాక్టీస్ చేయడానికి పేషెంట్స్ లేకపోవడంతో యాదాద్రి జిల్లా ఆసుపత్రికి వెళ్తున్నారని వివరించారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్‌ను సందర్శించి వెళ్లారే తప్పా… ఆసుపత్రిలోని వసతుల కొరతపై కేంద్రానికి విన్నవించలేదని ఎద్దేవా చేశారు.
ఎయిమ్స్‌లో ఇప్పటి వరకు ఒక్క ఆపరేషన్ కూడా జరగకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి పరిస్థితిని కేంద్రానికి వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎయిమ్స్ అభివృద్ధికి కేంద్ర ఒక్క పైసా కూడా సాయం చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఒకే ఒక్క ఎయిమ్స్ అని.. దాన్ని కూడా గాలికి వదిలేసిందని విరుచుకుపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రం పట్ల ఏ మాత్రం బాధ్యత లేదని విమర్శించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటమే తప్ప చేతలు చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిమ్స్‌లో చదువుతున్న 212 మంది వైద్య విద్యార్థులు ఎక్కడికి పోయి ప్రాక్టీస్ చేసుకోవాలో చెప్పాలని నిలదీశారు. కేంద్రం అవలంభిస్తున్న తీరును మానుకొని బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.