అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ముందుగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉందన్నారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణ రూపరేఖలు మారిపోయాయని ప్రభుత్వం చెబుతోందన్న ఆయన.. బయట వ్యక్తులను చూడనిస్తారు కానీ, తమను చూడనివ్వడం లేదని విమర్శించారు.
నిధులు, నీళ్లు, నియమకాల కోసమే రాష్ట్రం వచ్చిందన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.. రూ.18 లక్షల ఎకరాల ఆయకట్టు అన్నారు.. కానీ డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ మాత్రం కట్టలేదని ఆరోపించారు భట్టి. ముంపు బాధితులు నష్టపోకుండా చూడాలని ప్రభుత్వానికి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. దేవాదుల త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలన్నారు.
భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డారు హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కాళేశ్వరం సందర్శనకు వెళ్లొచ్చని చెప్పారు. వాళ్లు వెళ్తామన్నపుడు వరదలొచ్చి ప్రాజెక్టు పరిసర ప్రాంతమంతా బురదమయమైందని… కావాలంటే ఇప్పుడు వెళ్లి డౌట్స్ క్లియర్ చేసుకోండి అని స్పష్టం చేశారు. పనులు జరుగుతున్నాయని, అక్కడికి వెళ్తే భట్టి గారికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో.. లేదంటే బురదలో జారిపడతారేమోనని అలా చెప్పినట్టు మంత్రి సెటైర్లు వేశారు.
తన మైక్ కట్ చేసి మంత్రికి ఇచ్చారని.. కట్టేసి కొట్టినట్లు ఉందని భట్టి మండిపడగా.. కొరడాతో కాంగ్రెస్ నేతలు వారినివారే కొట్టుకుంటున్నారని హరీష్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల వరదలు వచ్చాయని.. అందువల్ల కాళేశ్వరంలో మోటార్లు దెబ్బతిన్నాయని చెప్పారు. వరదల వల్ల కాళేశ్వరం దెబ్బతినడంతో కాంగ్రెస్ నేతలు అనందపడ్డారని.. మోటార్లు బాగు చేసి.. యాసంగి పంటకు నీరు అందించామని చెప్పారు హరీష్ రావు.