తెలంగాణ రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి మార్చుకోవాలని మండిపడ్డారు మంత్రి తన్నీరు హరీష్ రావు. ధాన్యం కొనుగోలు విషయం నుండి ప్రతీ విషయంలో రైతులకు మోసమే చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సర్కారు ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే.. రాష్ట్రంలోని డీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతీ పథకాన్ని.. కేంద్రం పేరు మార్చి కాపీ కొడుతుందని ఆరోపించారు హరీష్ రావు. మిషన్ భగీరథను హర్ ఘర్ హల్ గా కాపీ కొట్టారని.. రైతు బంధు లాంటి పథకంను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో పరిచయం చేశారని విమర్శించారు. దళిత బంధు పథకంను దేశ వ్యాప్తంగా కేంద్రం ఎందుకు అమలు చేయలేకపోతుందని ప్రశ్నించారు.
దళితులపై బీజేపీ కపట ప్రేమను ఒలకబోస్తోందని అన్నారు హరీష్ రావు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకంను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. అన్నీ కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం దళిత బంద్ విషయంలో ఎందుకు ఆలోచిస్తుందో సమాధానం చెప్పాలని నిలదీశారు.
వచ్చే బడ్జెట్ లో దళిత బంధు పథకంకు 25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. తెలంగాణ దళితుల మీద తెలంగాణ బీజేపీ నాయకులకు ప్రేమ ఉంటే కేంద్రం నుంచి దళిత బంధు పథకంకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.