హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. గబ్బర్ సింగ్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ కాంబినేషన్ మళ్ళీ ఎలాంటి సినిమాతో వస్తారో అని అనుకున్న ఆడియెన్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మొదట హరీష్ శంకర్ భవదియుడు భగత్ సీంగ్ అనే కథను అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఎందుకో ఆ సినిమా కథ క్యాన్సిల్ అయ్యింది.
ఇక మళ్ళీ కొన్ని నెలల అనంతరం తెరి రీమేక్ ను లైన్ లోకి తీసుకు వచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ కథలో కొన్ని మార్పులు చేసి సరికొత్తగా చూపించాడానికి సిద్ధమయ్యారు. రీమేక్ అనగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. తెలుగులో కూడా డబ్ అయిన సినిమాను మళ్ళీ రీమేక్ ఎందుకు చేస్తున్నారు అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ చిత్ర యూనిట్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కథలో కొన్ని మార్పులు చేసి ఆసక్తికరంగా సినిమాను తెరపైకి తీసుకురావాలి అని డిసైడ్ అయింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీ లీల హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కథలో దర్శకుడు పవన్ కళ్యాణ్ ను ప్రొఫెసర్ గా చూపించబోతున్నాడు.
ఒరిజినల్ కథలో అయితే విజయ్ ఒక బేకరీ ఓనర్ గా కనిపించాడు. అయితే మరొక కీలకమైన మార్పు కూడా చేయడానికి దర్శకుడు రెడీ అయ్యాడట. ఒరిజినల్ కథలో హీరో కు ఒక కూతురు కూడా ఉంటుంది. అయితే తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ కు పాత్రకు కొడుకును చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మంచి ఎమోషనల్ బాండింగ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉండేలాగా దర్శకుడు హరీష్ శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక బాబు పాత్ర కోసం ఇప్పటికే ఆడిషన్స్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఒకరిని ఫిక్స్ చేసి కీలకమైన షెడ్యూల్ కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.