పవన్ కల్యాణ్ తో ఉస్తాబ్ భగత్ సింగ్ సినిమా ప్రకటించాడు హరీశ్ శంకర్. అంతవరకు మాత్రమే ఆయన చేయగలిగాడు. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది, పవన్ ఎప్పుడు కాల్షీట్లు ఇస్తారనే అంశాలు హరీశ్ చేతిలో లేవు. అలా దాదాపు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్నాడు హరీశ్.
ఇప్పుడు హరీష్ శంకర్ లో టెన్షన్ మరింత పెరిగింది. దీనికి కారణం పవన్ కల్యాణ్ మరో సినిమాను స్టార్ట్ చేయడమే. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓజీ సినిమా మొదలైంది. ఈ సినిమాకు హరీష్ కు సంబంధం లేదు కానీ పవన్ లైనప్ కు హరీష్ కు చాలా దగ్గర సంబంధం ఉంది.
పవన్ నుంచి ఓ కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి హరీశ్ శంకర్ సినిమా లేట్ అవుతోంది. నిజానికి భీమ్లానాయక్ కంటే ముందు హరీశ్ సినిమానే రావాలి. కానీ హరీశ్ ను పక్కనపెట్టి, భీమ్లానాయక్ చేశాడు పవన్. ఆ తర్వాత కూడా హరీశ్ సినిమా పక్కనపెట్టి, వినోదాయ శితం సినిమా రీమేక్ కు కొబ్బరికాయ కొట్టారు. ఆ సినిమాకు కాల్షీట్లు ఇచ్చారు.
ఇప్పుడు ఓజీ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు పవన్. దీంతో హరీశ్ లో టెన్షన్ రెట్టింపు అయింది. తన సినిమాకు కాల్షీట్లు ఇవ్వకుండా, ఇలా వరుసగా ఇతర సినిమాలకు పవన్ వర్క్ చేస్తుండడంతో మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నాడు ఈ దర్శకుడు.