పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చి చాన్నాళ్లయింది. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా పెట్టారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఓ సినిమా ఫంక్షన్ లో, తను త్వరలోనే ఈ సినిమా చేస్తానంటూ స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించాడు. ఇంత జరిగినా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేది అనుమానమే.
తాజాగా పవన్ చేసిన ఓ పొలిటికల్ ప్రకటన వల్ల హరీశ్ శంకర్ సినిమా డైలమాలో పడింది. దసరా తర్వాత దాదాపు రాజకీయాలకే అంకితమౌతాననే అర్థం వచ్చేలా పవన్ ప్రకటన చేశాడు. ఈ గ్యాప్ లో ఆయన హరిహర వీరమల్లు, వినోదాయశితం రీమేక్ మాత్రమే పూర్తిచేస్తాడు. అలా హరీశ్ శంకర్ సినిమా మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
తాజా పరిణామాల నేపథ్యంలో, హరీష్ శంకర్ కూడా ఆలోచనలో పడ్డాడు. పవన్ సినిమాను కొన్నాళ్లు పక్కనపెట్టి.. ఈ గ్యాప్ లో మరో సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. అల్రెడీ తన దగ్గరున్న కథల్ని పరిశీలించడంతో పాటు.. ఖాళీగా ఉన్న స్టార్ హీరోలు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాడు. ఎవరైనా పెద్ద హీరో తన కథకు ఓకే చెబితే వెంటనే సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నాడట.
హరీశ్ శంకర్ కెరీర్ కు ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంకా గ్యాప్ వస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఇప్పుడు మధ్యేమార్గంగా మరో హీరోతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నాడట. హరీశ్ నిర్ణయానికి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేలానే ఉంది. పవన్ ఎలాగూ అడ్డుచెప్పడు.