గవర్నర్ ప్రసంగం విషయంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై హరీష్ రావు కౌంటర్ ఎటాక్ చేశారు. గవర్నర్ ను అవమానించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అయినా.. గవర్నర్ కు ఇబ్బంది ఉంటే సీఎంతో, సెక్రటేరియట్ తో మాట్లాడతారని అన్నారు.
కేసులు తమ మీద కాదు బీజేపీ నేతల మీదే వేయాలన్న హరీష్.. టీఆర్‌ఎస్ ఆరిపోయే దీపం కాదు.. దారిచూపే కాగడ అని అభివర్ణించారు. బీజేపీనే తెలంగాణలో ఎన్నటికీ వెలుగని దీపం అంటూ సెటైర్లు వేశారు. బీజేపీలో రహస్య మీటింగులు జరుగుతున్నాయి.. ముందు పార్టీని చక్కబెట్టుకో అని సంజయ్ పై మండిపడ్డారు.
బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. గవర్నర్ ప్రసంగంపై అసలు బీజేపీ నేతలకు మాట్లాడే అర్హతే లేదన్నారు హరీష్. అసోం సీఎం మాతృమూర్తులను అవమానించేలా మాట్లాడితే.. బండి ఆయన వ్యాఖ్యలను సమర్థించారని గుర్తు చేశారు. అలాంటి బండికి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
2014లో మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గుజరాత్ గవర్నర్ ను డిస్మిస్ చేశారని గుర్తు చేశారు హరీష్ రావు. రాజ్‌భవన్ కు కాషాయం, బీజేపీ రంగు పులుముతున్నారని విమర్శించారు. మహిళా సీఎం మమతా బెనర్జీని గవర్నర్ ను అడ్డుపెట్టుకుని వేధించడం లేదా? అంటూ మండిపడ్డారు.
బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 80 శాతం ప్రధాని ప్రచారం కోసం ఖర్చు చేస్తే పథకం కోసం 20 శాతం మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు హరీష్. ఈ విషయమై పార్లమెంటరీ కమిటీ నివేదికను మీడియాకు చూపించారు.