టీమిండియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న టీ20 పరుగుల రికార్డును ప్రస్తుత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరగ రాసింది. హర్మన్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. అత్యధిక టీ20 పరుగులు చేసిన టీమ్ ఇండియా ప్లేయర్ గా అగ్రస్థానంలో నిలిచింది.
ఇప్పటివరకు 123 మ్యాచుల్లో 27 సగటుతో 2,372 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ.. ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి. మిథాలీ క్రికెట్ నుంచి తప్పుకున్న 16 రోజులకే ఈ రికార్డ్ బద్దలవడం విశేషం.
శ్రీలంక పర్యటనలో భాగంగా దంబుల్లా వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ (31 పరుగలు) సహా ఓపెనర్ స్మృతి మంధాన (39 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ విజయంతో 2-0తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.టీమ్ఇండియా జట్టుకు సుదీర్ఘకాలంపాటు సారథిగా బాధ్యతలు చేపట్టిన మిథాలీ రాజ్.. క్రికెట్ నుంచి తప్పుకునే వరకు భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ హోల్డర్‌గా ఉంది. 89 టీ20లు ఆడిన మిథాలీ.. 38 సగటుతో 17 అర్థశతకాలు నమోదు చేసింది. మొత్తం 2,364 పరుగులను నమోదు చేసింది.