మిస్ యూనివర్స్ పోటీలు కన్నుల పండుగగా జరిగాయి. 71వ ఎడిషన్‌లో మొత్తం 80 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అమెరికాలోని లూసియానాలోని న్యూ ఓర్లిన్స్ లో నిర్వహించిన ఈ పోటీల్లో అందాల భామలు తమ అందాలను ప్రదర్శించారు.
ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఎగురేసుకుపోయింది. మిస్ యూనివర్స్-2021 విన్నర్, పంజాబీ భామ హర్నాజ్ సంధు ఈ పోటీలకు హాజరై బొన్ని గాబ్రియేల్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తొడిగింది. ఆ సమయంలో స్టేజ్‌పై ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
71వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ను ప్రకటించే సమయంలో హర్నాజ్ స్టేజ్ పైకి వచ్చారు. విశ్వ సుందరి హోదాలో చివరిసారిగా ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ క్రమంలో హర్నాజ్ ఒక్కసారిగా ఎమోషనల్ గా కన్నీరు పెట్టుకుంది. అనంతరం ర్యాంప్ వాక్ చేస్తూ స్టేజిపై పడిపోయింది.
మళ్లీ తిరిగి ఆమె ర్యాంప్ వాక్ కొనసాగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది ఇలా వుంటే ఈ పోటీల్లో హర్నాజ్ సంధూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డ్రస్‌పై మాజీ విశ్వసుందరీమణులు సుస్మితా సేన్, లారా దత్తా ఫొటోలతో డిజైన్ చేసిన బ్లాక్ డ్రెస్‌ను ఆమె ధరించారు.