హర్నాజ్ కౌర్ సంధు. కుర్రకారు నోట్లో నానుతున్న పేరు. వార్తా చానళ్లలో మెరుస్తున్న తీరు చూస్తే.. చాలా మంది యువతులు ఆమెను రోల్ మోడల్ గా తీసుకుంటారు. 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టిన 21 ఏళ్ల పంజాబీ అమ్మాయి హర్నాజ్ కౌర్. అప్పుడెప్పుడో.. ఈ అమ్మాయి పుట్టిన 2000 సంవత్సరంలో భారత్ కు ఈ అరుదైన గౌరవం దక్కింది. తరువాత అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ పరిణామాలు చూస్తే.. భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించడానికే పుట్టిందేమో అనిపిస్తుంది.
అయితే, ప్రపంచంలో ఇంత గొప్ప స్థానానికి చేరుకున్న హర్నాజ్ మాత్రమే మనకు తెలుసు. కానీ, ఈ స్థానాన్ని చేరుకోవడానికి ఆమె ఎదుర్కొన్న అవమానాలు అంతా చిన్నవేం కాదు. అయితే, అవమానాలనే అవకాశాలుగా మార్చుకుంది. గెలుపు శిఖరాలను చేరుకుంది.
చిన్నప్పటి నుంచి హర్నాజ్ మోడలింగ్ పై ఆసక్తి చూపించేది. తన తల్లి కూడా ప్రోత్సహించడంతో దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. విద్యార్థి దశ నుంచే మోడలింగ్ లో శిక్షణ తీసుకుంది. తన కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో చాలా వేదికలను పంచుకుంది. అయితే, తోటివారి నుంచి చాలా అవమానకరమైన మాటలు ఎదుర్కోంది. సన్నగా ఉంటావు.. నీకు మోడలింగ్ అవసరమా? నువ్వు మరీ అంత అందగత్తెవి కాదు.. ఈ కెరీర్ లో నువ్వు రాణించలేవు. మోడలింగ్ కు కావలసిన బాడీ నీకు లేదు. ఇలాంటి అవమానాలు ఎన్నో దాటుకొని వచ్చింది.
వీటిని తనకు అనుకూలంగా మార్చుకొని చాలా వేదికలపై మెరిసింది. తన ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి దొరికిన ఏ చిన్నా అవకాశాన్ని వదులుకోలేదు. నటిగా పలు పంజాబీ చిత్రాల్లో నటించారు. ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ మిస్ యూనివర్స్ పోటీల్లోకి అడుగుపెట్టారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 80 దేశాల నుంచి వచ్చిన సుందరాంగులను నెట్టుకొని విశ్వ వేదికపై విజయకేతనం ఎగురవేసింది.