పెళ్లి అనేది ప్రతీ వ్యక్తి జీవితంలో ఓ ప్రత్యేకమైన వేడుక. వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల సమక్షంలో వివాహం ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. అందుకే ఆ క్షణాలను కెమెరాలో బంధించి తరుచూ చూసుకుంటారు. అయితే.. ఇప్పుడు ఓ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్ల మనస్సులను దోచుకుంటుంది. వధువు హర్షు సంగ్తానీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. వధువరుల మధ్య జరిగిన కాంట్రాక్టే దీనికి కారణం.
హర్షు తనకు కాబోయే భర్త కరణ్ కు ఐదు కండిషన్స్‌ను పెట్టింది. పైగా వాటిని ఓ వంద రూపాయల బాండ్ పై రాయించి కరణ్ తో సంతకం కూడా పెట్టించుకుంది. దానికి లవ్ అగ్రిమెంట్ అని పేరు కూడా పెట్టింది. పైగా దానిని లామినేషన్ చేయించి దాచి పెట్టుకుందట. ఇంత పక్కాగా చేస్తే.. పెళ్లి కొడుకు పని అయిపోయిందనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపాటే. నిజానికి కరణ్ కు ఆమె పెట్టిన షరతులు నవ్వులు పూయిస్తున్నాయి.
ఐదు కండిషన్స్‌లో మొదటిది.. ప్రతి రోజూ రాత్రి వేళ వరుడు తన దగ్గరే పడుకోవాలట. రెండోది వెబ్ సిరీస్ తనతో కలిసే చూడాలట. మూడో షరతు.. రోజుకి మూడుసార్లు తనకి ఐలవ్ యూ చెప్పాలట. నాలుగో షరతు.. బార్బెక్యూ ఫుడ్స్‌ని ఆమె లేకుండా ఒక్కడే తినకూడదట. ఆమె ఎప్పుడు ఏది అడిగినా అతను నిజమే చెప్పాలని ఐదో షరతుగా పెట్టింది ఆ యువతి. ఈ నిబంధనలతో రాయించుకున్న బాండ్ పేపర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీనిని ఫిబ్రవరి 20న హర్షు పెళ్లికి మేకప్ చేసిన భూమికా సాజ్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దీనిని 23 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ కండిషన్స్ పై నెటిజన్లు చాలా సరదాగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి కాంట్రాక్ట్ ఇంతకుముందెప్పుడూ చూడలేదంటున్నారు. ఒక యూజర్ ఆమె అక్షరాలా కాంట్రాక్ట్ వివాహం చేసుకుందని కామెంట్ చేశారు.