అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నాలుగేండ్ల సర్వీసు పూర్తిచేసుకుని వచ్చిన అగ్నివీరుల్లో 75 శాతం మందికి గ్యారెంటీగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత వారికి గ్రూప్ సీతో పాటు పోలీసు శాఖల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు.
సైన్యంలో ఉద్యోగాల నియామకాల కోసం అగ్నిపథ్ అనే కొత్త పథకాన్ని ఈ నెల 14న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్త నిరసనలు మొదలయ్యాయి. పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి.
నిరసనల నేపథ్యంలో కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసి కొన్ని నిబంధనలను సడలించింది. ఈ ఏడాది మొదటి రిక్రూట్ మెంట్ కు అభ్యర్థులకు రెండేండ్లు వయో సడలింపు ఇస్తున్నట్టు పేర్కొంది. దీంతో పాటు నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి పలు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించింది.