కాషాయం ముసుగులో కామ క్రీడలు సాగించాడు. భూత వైద్యం పేరుతో బూతు కార్యక్రమాలకు పాల్పడ్డాడు. జిలేబీ బాబాగా అవతరించి ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాడు. పోలీసులు సైతం విస్తుపోయేలా చేసిన ఓ దొంగ బాబా బండారం హర్యానాలో నాలుగేళ్ల క్రితం వెలుగుచూసింది. అయితే.. ఎట్టకేలకు అతడికి శిక్ష ఖరారైంది. తాజాగా ఫతేహాబాద్ కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది.
అత్యాచారాలకు పాల్పడ్డ ఈ దొంగ బాబా అసలు పేరు అమర్ వీర్. ఇతని సొంత రాష్ట్రం పంజాబ్. 20 ఏళ్ళ క్రితం భార్యతో సహా హర్యానాకు వచ్చి అమర్ పురి తహానా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. కొన్నాళ్ళకు భార్య మృతి చెందింది. రెండేళ్ల తర్వాత తోహానాలో జిలేబీ బాబాగా అవతారమెత్తి జనాల దృష్టిని ఆకర్షించాడు.
పట్టిన దెయ్యాలను వదిలిస్తానని ప్రకటనలు గుప్పించాడు. మాయమాటలు నమ్మిన కొందరు మహిళలు అతడి దగ్గరకు వెళ్ళారు. ఈ క్రమంలోనే వారిని లొంగదీసుకున్నాడు. తన దగ్గరకు వచ్చిన మహిళలకు మత్తుమందు కలిపిన ద్రవాలు తాగించేవాడు. అనంతరం అకృత్యాలకు పాల్పడేవాడు. అంతేకాకుండా వీడియోలు సైతం తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. వారి నుంచి డబ్బు డిమాండ్ చేసేవాడు. మరికొందరిని తనతో రిలేషన్ కొనసాగించమని వేధించేవాడు.
ఈ క్రమంలో జిలేబీ బాబా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ధైర్యం తెచ్చుకున్న మరికొందరు బాధిత మహిళలు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పాపం పండింది. 2018లో ఫతేహాబాద్ జిల్లాలోని తోహానాలో ఉన్న జిలేబీ బాబా నివాసంపై పోలీసులు దాడి చేసి, తనిఖీలు చేయగా 120కి పైగా వీడియోలు లభించాయి. వీటితో పాటు కొన్ని మత్తు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వీడియోలన్నీ మొబైల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించినట్లు గుర్తించారు. నిందితుడిని పలు సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఈ దుర్మార్గుడికి ఫతేహాబాద్ కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసింది.