హర్యానా రాష్ట్రంలోని రేవరి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై నిలిపి ఉన్న ట్రక్కును క్రూయిజర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను మార్చురీకి తరలించారు. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు బావల్ కలెక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
రాజస్థాన్‌కు చెందిన మాలు రామ్ అనే వ్యక్తి తన తండ్రి ఆస్థికలను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లారు. అస్తికలు కలిపి తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
Advertisements
అయితే, క్రూజర్‌లో 17 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.