టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ శివారులో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పంత్ స్వయంగా నడుపుకుంటూ వెళ్తున్న కారు.. డివైడర్‌కు ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయ్యింది. ఆ కారు పరిస్థితి చూసిన వాళ్లు అందులో ఉన్న వాళ్లు బతికి ఉండే అవకాశమే ఉండదని భావిస్తారు. అంత భయంకరంగా మారిపోయింది. అయితే పంత్ నడిపిన మెర్సిడెజ్ బెంజ్ కారు అత్యంత సెక్యూరిటీ ఫీచర్స్ కలిగి ఉండటంతో స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు.
రిషబ్ పంత్ కారు వేగంగా వచ్చి డివైడర్లను ఢీకొట్టినప్పుడు ఓ బస్ డ్రైవర్ ప్రత్యక్షంగా చూశాడు. జాతీయ రహదారిపై తనకు ఎదురుగా మరోలైన్‌లో వేగంగా వచ్చి డివైడర్లను ఢీకొట్టి.. పల్టీలు కొడుతుండగా.. బస్సు కిందకు వస్తుందేమో అనే అనుమానంతో డ్రైవర్ సుశీల్ మాన్ పక్కకు వెళ్లాడు. తర్వాత బస్సు దిగి కారు వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే అందులోని వ్యక్తి సగం బయటకు వచ్చి ఉండటాన్ని గమనించానని చెప్పుకొచ్చాడు. తాను ఒక క్రికెటర్‌ని అని అమ్మకు ఫోన్ చేయమని పంత్ చెప్పాడని.. అయితే వాళ్ల అమ్మ నెంబర్ స్విచ్ఛాఫ్ వచ్చిందని డ్రైవర్ అన్నాడు.
అతడిని కాపాడి హీరోలుగా నిలిచారు బస్సు డ్రైవర్, సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్. వీరిద్దరే లేకుంటే రిషబ్ ప్రాణాలతో ఉండేవారు కాదని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ నిజమైన హీరోలుగా నిలిచారు. తాజాగా హర్యానా రోడ్ వేస్ వీరిద్దరిని సన్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిద్దరిని గౌరవించే అవకాశం ఉందని తెలుస్తోంది. హర్యానా ఆర్టీసీ తరుఫున వీరిద్దరిని సత్కరించారు.
హర్యానా రోడ్‌వేస్ పానిపట్ డిపో జనరల్ మేనేజర్ కుల్దీప్ జంగ్రా వారికి ప్రశంసా పత్రం, షీల్డ్ అందించారు. డ్రైవర్, కండక్టర్ మానవత్వానికి ఉదాహరణగా నిలిచారని జాంగ్రా అన్నారు.